బండిలో.. బ్రహ్మాస్త్రం


ప్రమాదంలో సాక్షిలా ఉపయోగపడుతుంది...
నిబంధనల ఉల్లంఘనుల్ని నిలువరిస్తుంది...
బీమా వాదనలో మన తరపున వకాల్తా పుచ్చుకుంటుంది...
కారులో డాష్‌కామ్‌ బిగిస్తే కలిగే సౌలభ్యాలెన్నో...
ఖరీదు తక్కువ.. వాడటం తేలిక...
ప్రతి వాహనంలో తప్పనిసరి గ్యాడ్జెట్‌లా మారిపోతున్న ఈ డాష్‌బోర్డ్‌ కెమెరా ఉపయోగాలు, వాడే విధానం, జాగ్రత్తలు.. వివరంగా తెలుసుకుందాం.
తేలిగ్గా చెప్పాలంటే డాష్‌బోర్డ్‌ మీద బిగించే కెమెరానే డాష్‌కామ్‌. దీన్ని రేయర్‌వ్యూ మిర్రర్‌కి ముందూ అతికించుకోవచ్చు. ప్రయాణంలో విండ్‌షీల్డ్‌కి ఆవలివైపు రోడ్డుపై జరిగే ప్రతి దృశ్యాన్నీ రికార్డు చేస్తుందిది. దీని తీగను యూఎస్‌బీ లేదా సిగరెట్‌ లైటర్‌ పోర్ట్‌ ద్వారా అనుసంధానం చేసుకోవచ్చు. తర్వాత కారు ఇంజిన్‌ ఆన్‌ చేయగానే ఆటోమేటిగ్గా పని ప్రారంభిస్తుంది. ఏవైనా అల్లర్లు, ప్రమాదాలు జరిగినపుడు నిందితుల్ని గుర్తించే ఉద్దేశంతో అమెరికా పోలీసులు తమ వాహనాల్లో మొదటిసారి ఈ డాష్‌కామ్‌లు ఉపయోగించారు. తర్వాత వ్యక్తిగత వాహనాల్లోనూ వాడకం మొదలైంది. బేసిక్‌ నుంచి హై-ఎండ్‌ కారు వరకు ఎందులో అయినా దీన్ని అమర్చుకోవచ్చు. మెర్సిడెస్‌ బెంజ్‌, బీఎండబ్ల్యూలాంటి  కొన్ని ఖరీదైన కార్లలో ఇన్‌బిల్ట్‌గా వస్తున్నాయివి.
ఉపయోగాలెన్నో
డాష్‌కామ్‌ ఖరీదు తక్కువ. ఉపయోగాలెక్కువ. అవేంటో వివరంగా..
ప్రమాదాల్లో సాక్షిగా: ఆపదల్లో ఆదుకుంటుందనే కారణంతో ఎక్కువమంది ప్రస్తుతం డాష్‌బోర్డ్‌ కెమెరా వాడకానికి మొగ్గు చూపుతున్నారు. దురదృష్టవశాత్తు మన వాహనం ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే చట్టపరమైన ఇబ్బందుల్లో పడకుండా ఇది సాక్ష్యంగా నిలుస్తుంది. ప్రమాదం ఎక్కడ, ఏ సమయంలో జరిగింది? కారణమేంటి? కచ్చితంగా తెలుసుకోవచ్చు. కొన్ని సమయాల్లో కొందరు రాంగ్‌రూట్‌లో వచ్చి మన కారు ఢీకొడుతుంటారు. తప్పు వారిదైనా అడ్డగోలుగా వాదించి పెద్దమొత్తంలో డబ్బులు డిమాండ్‌ చేస్తారు. అలాంటపుడు మనల్ని రక్షించేది ఇదే. దీంతో డబ్బు, సమయం ఆదా అవుతాయి.
ఉల్లంఘనులకు పాఠం: మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎదుటివారు అప్రమత్తంగా లేకపోతే ప్రమాదాలు తప్పవు. నిబంధనలు ఉల్లంఘించేవారు, తాగి నడిపేవారు, ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసేవారు.. ఇలాంటివారితో సాటి వాహనదారులు, పాదచారులకు ఎల్లప్పుడూ ప్రమాదమే. వారిని అడ్డుకోవడానికి పోలీసులే అక్కర్లేదు. ప్రతిక్షణాన్ని బంధించే డాష్‌కామ్‌లు వారిని ఓ చూపు చూసి చట్టానికి పట్టిస్తాయి.
బెంగ వద్దు: మైనర్లు ఇంట్లో చెప్పకుండా కారు తీసుకొని బలాదూర్లు తిరుగుతుంటారు. డ్రైవర్లను నియమించుకుంటే సొంత అవసరాలకు వాడుకుంటుంటారు. స్నేహితులు, బంధువులకు కారిస్తే ఎక్కడెక్కడ తిరుగుతున్నారో అనే బెంగ. ఇలాంటి సందర్భాల్లో కాపలాదారుగా పని చేస్తుంది డాష్‌కామ్‌. చాలా డాష్‌కెమెరాలు జీపీఎస్‌తో అనుసంధానమై ఉండటంతో ఏయే మార్గాల్లో ప్రయాణించిందీ, ఎంత వేగంతో వెళ్లిందీ తెలుసుకోవచ్చు. అప్రమత్తంగా ఉండి మరోసారి అలా జరగకుండా చూసుకోవచ్చు.
బీమాకి ధీమా: వాహనం ఏదైనా ప్రమాదంలో దెబ్బతిన్నపుడు నష్టపరిహారం ఇవ్వడానికి బీమా కంపెనీలు కొన్నిసార్లు రకరకాల కొర్రీలు పెడుతుంటాయి. మనమే కావాలని చేసిన ప్రమాదంలా ఉందని వాదిస్తుంటాయి. అలాంటి సమయంలో మనకు అండగా నిలబడేవి ఇవే. నకిలీ ప్రమాదాలతో నష్టపరిహారం పొందాలని చూసేవారికి సైతం ఈ డాష్‌కామ్‌లు చెక్‌ పెడతాయి.
యూట్యూబ్‌లో పాపులర్‌: దూరప్రయాణాలు, సాహసయాత్రల్లో ప్రతి క్షణం, ప్రతి మలుపూ ఓ మధుర జ్ఞాపకమే. అప్పుడప్పుడు అరుదైన సంఘటనల్ని ఒడిసిపట్టుకోవచ్చు. కాస్త ఓపిక, సృజనాత్మకత ఉంటే వీడియోల్ని ఎడిటింగ్‌ చేసి, గ్రాఫిక్‌లు జోడించి మంచి ట్రావెలాగ్‌లుగా రూపొందించి యూట్యూబ్‌లో పెట్టేయొచ్చు. క్లిక్‌ అయితే అది కాసులు కురిపించే వ్యాపకంగానూ పనికొస్తుంది. ఇక మన డాష్‌కామ్‌ ఏళ్ల కిందట రికార్డు చేసిన వీడియోలను అప్పుడప్పుడు బయటికి తీసి చూసుకుంటే అదో తీపి జ్ఞాపకంగానూ మిగిలిపోతుంటుంది.
ఇవీ జాగ్రత్తలు
డాష్‌కామ్‌తో ఎన్ని ప్రయోజనాలున్నా వాడకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే అత్యుత్తమ ఫలితాలుంటాయి.
డాష్‌బోర్డ్‌పైన బిగించే బదులు రేయర్‌ వ్యూ మిర్రర్‌కి ముందు అతికిస్తేనే డాష్‌కామ్‌ పనితీరు బాగుంటుంది. రోడ్డుపై అత్యధిక భాగం కవర్‌ చేయగలుగుతుంది. విండ్‌షీల్డ్‌ వైపర్లు పని చేస్తున్నపుడు కెమెరాకు అడ్డం రాకుండా చూసుకోవాలి.
రాత్రివేళలు, వర్షం పడుతున్నపుడు, పొగమంచు కురుస్తున్నపుడూ రికార్డింగ్‌ నాణ్యత బాగుండాలంటే హెచ్‌డీ రికార్డింగ్‌ సామర్థ్యం ఉన్నవాటినే కొనుగోలు చేయాలి.
జీపీఎస్‌, వై-ఫై సామర్థ్యం ఉన్న కెమెరాలతో వీడియోని క్షణాల్లో డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి, ఇతరులకు పంపడానికి, మెమొరీని తేలిగ్గా కాపీ చేయడానికి వీలుంటుంది. రిమోట్‌ కంట్రోల్‌తో పనిచేసే డాష్‌కామ్‌లూ అందుబాటులో ఉన్నాయి. వీలైతే వాటినే ఎంచుకోవాలి.
విండ్‌షీల్డ్‌కి అవతలివైపు రోడ్డుపై జరిగే దృశ్యాలను రికార్డు చేసే వాటితోపాటు ఈమధ్యకాలంలో కారు లోపలివైపు కూడా రికార్డు చేయగలిగే కామ్‌కార్డర్లు వచ్చేశాయి.
క్లాస్‌ 10 మెమొరీ కార్డులతో రికార్డింగ్‌ దృశ్యాలు స్పష్టంగా ఉంటాయి. సాంకేతిక ఇబ్బందులు తలెత్తవు. అంతకులోపువి అయితే ఫైల్‌ ఎర్రర్‌లు, వైరస్‌ వచ్చే ప్రమాదం ఉంది. దీంతోపాటు ఎక్కువ రికార్డింగ్‌ నిడివి సామర్థ్యం ఉండే 32, 64జీబీ మెమొరీ కార్డులనే వాడితే మేలు.
దూరప్రయాణాల్లో అదనంగా ఒకట్రెండు మెమొరీ కార్డులు వెంట ఉంచుకోవాలి. ప్రయాణంలో ఏవైనా ముఖ్యమైన సంఘటనలు రికార్డు అయితే వై-ఫై ద్వారా వెంటనే వాటిని సేవ్‌ చేసుకోవాలి. అవసరం లేనివి డిలీట్‌ చేస్తుండాలి.
అమ్మకాల్లో మేటి
పనితీరు, సామర్థ్యం, నాణ్యత ఆధారంగా డాష్‌కామ్‌లు రూ.2 వేల నుంచి రూ.20 వేలల్లో లభిస్తున్నాయి. ఆటోమొబైల్‌ ఉత్పత్తుల దుకాణాల్లోనే కాదు.. ఆన్‌లైన్‌లోనూ వీటిని కొనుక్కోవచ్చు. ప్రస్తుతం అత్యధికంగా అమ్ముడవుతున్న కొన్ని మోడళ్లు. వాటి ప్రత్యేకతలు.
ప్రోకస్‌ కాన్వాయ్‌: లోపల, బయట రెండువైపులా రికార్డు చేస్తుంది. జీపీఎస్‌, వై-ఫైతో అనుసంధానం చేయొచ్చు. 32జీబీ స్టోరేజీ సామర్థ్యం ఉంది.  ధర: రూ.3,699
ట్రాన్సెండ్‌ డ్రైవర్‌ ప్రో 200: ఏడు లేయర్ల లెన్స్‌తో పని చేస్తుంది. పొగమంచు, మసక దృశ్యాలు తొలగించి స్పష్టంగా రికార్డు చేస్తుంది. ఎల్‌సీడీ తెర, రెండువైపులా రికార్డింగ్‌, వై-ఫై కనెక్టివిటీ కొన్ని ప్రత్యేకతలు.  ధర: రూ.14,079
ఎస్‌జేకామ్‌ ఎస్‌జే4000: సాహసయాత్రలు చేసే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించారు. మోటార్‌సైకిళ్లకూ పని చేస్తుంది. ముప్పై మీటర్ల లోతు నీటిలో రికార్డింగ్‌ చేసినా చెడిపోదు. 32జీబీ సామర్థ్యం, లూప్‌ రికార్డింగ్‌.. ఉన్నాయి.  ధర: రూ.4,795
గార్మిన్‌ జీడీఆర్‌ సీ300: 1440పీ అత్యధిక రిజల్యూషన్‌తో వీడియోలు రికార్డు చేస్తుంది. జీపీఎస్‌, వాయిస్‌ కంట్రోల్‌, అత్యధిక వైడ్‌ యాంగిల్‌ రికార్డింగ్‌ ప్రత్యేకతలు. 3.0ఎల్‌సీడీ డిస్‌ప్లే, తక్కువ వెలుతురులోనూ నాణ్యమైన రికార్డింగ్‌. వీడియోల్ని చిత్రాలు తీసుకునే స్నాప్‌షాట్‌ సౌలభ్యం ఉంది.  ధర: రూ.8,400
డ్రమ్‌స్టోన్‌ మినీ: 2.4 అంగుళాల తెర, 200 గ్రాముల బరువుండే అతిచిన్న కెమెరా ఇది. కారు లోపల, బయట రికార్డ్‌ చేయొచ్చు. విండ్‌షీల్డ్‌, డాష్‌బోర్డ్‌ ఎక్కడైనా బిగించుకోవచ్చు.  ధర: రూ.5వేలు
లాంబెంట్‌ మినీ: తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో వచ్చిన కెమెరా. బరువు తక్కువ. యాంటీ షేక్‌ ఇమేజ్‌, 2.4 అంగుళాల టీఎఫ్‌టీ తెర.. ప్రత్యేకతలు  ధర: రూ.1199
అల్రియా బ్యాకప్‌: మిగతా వాటికి భిÅన్నంగా 4.3అంగుళాల వెడల్పాటి  టీఎఫ్‌టీ తెరతో వస్తుంది. జీ-సెన్సర్‌, ఇన్‌బిల్ట్‌ మైక్రోఫోన్‌, ప్లేబ్యాక్‌ ఆప్షన్‌, 165డిగ్రీల కోణం, తక్కువ వెలుతురులోనూ రికార్డింగ్‌ సామర్థ్యం, 350ఎంఏహెచ్‌ లిథియం-అయాన్‌ బ్యాటరీ..ప్రత్యేకతలు
   ధర: రూ.8,999

Comments

Popular posts from this blog

How are Cloud Storage, Cloud Backup, and Cloud Sync Different

How to Install Guest Additions in VirtualBox

10 Tips to Get the Most Out of Amazon