Indian Tourist places like foreign countries

నయాగరా అందాల కోసం అమెరికా వెళ్లాలా..?
భారతదేశం భూతలస్వర్గమని మన కవులు వర్ణించారు. ప్రపంచంలో పేరుగాంచిన అందాలని తలదన్నె విధంగా మన మాతృభూమిలో కొన్ని ప్రదేశాలు, కట్టడాలు, ప్రాంతాలు ఉన్నాయంటే నమ్మితీరాలి. ప్రపంచాన్ని తిరిగేయాలని కలలు కనే యాత్రికులు... దేశంలోని ఈ ప్రదేశాలు చూస్తే ప్రపంచాన్ని చూసేసినట్టే. ఇంతకి అవి ఏంటో తెలుసుకుందామా!
అలప్పుళ-వెనిస్‌
వెనిస్‌లో పడవ షికారుకు వెళ్లాలనుకునే ముందు ఒక సారి  కేరళలోని అలప్పుళకు  వెళ్లండి. అక్కడ బ్యాక్‌ వాటర్‌లో.. హౌస్‌బోట్‌లో షికారు చేస్తుంటే ఎవరైనా అక్కడి ప్రకృతికి దాసోహమైపోతారు. వెనిస్‌తో ఏ మాత్రం తీసిపోని అలెప్పీ అందాలకి పర్యటకులు మంత్రముగ్ధులవ్వాల్సిందే. అందుకే అలప్పుళను ‘వెనిస్‌ ఆఫ్ ది ఈస్ట్‌’గా పిలుస్తారు.

రాణ్‌ ఆఫ్‌ కచ్‌- సాల్ట్‌ లాండ్స్‌ ఆఫ్ ఉటా 
సాల్ట్‌ లాండ్స్‌ చూడటం కోసం ఉటా దాకా వెళ్లాల్సిన అవసరంలేదు. గుజరాత్‌లోని రాణ్‌ ఆఫ్‌ కచ్‌కి వెళ్లండి. ఈ రెండు ప్రదేశాల్లో మీరు ఒకే తరహా అనుభూతి పొందుతారు. చలికాలంలో దీని అందం మరింత రెట్టింపుగా కనిపిస్తుంది. ఈ ప్రాంతానికి నవంబర్‌ రెండో వారం నుంచి ఫిబ్రవరి వరకు యాత్రికుల తాకిడి ఎక్కువ. 

గండికోట ఫోర్ట్‌- గ్రాండ్‌ కెనాన్‌‌
యునైటెడ్‌ స్టేట్స్‌లోని గ్రాండ్‌ కెనాన్‌కు దీటుగా భారత్‌లో గండి కోట ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ఉన్న గండి కోటను చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఎంతో పురాతనమైన గండికోట నేటికీ చెక్కు చెదరకుండా యాత్రికులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. దీనిని పశ్చిమ కల్యాణీ చాళుక్య రాజైన అహవమల్ల సోమేశ్వరుని సంరక్షకుడు కాకరాజు కట్టించాడని ప్రతీతి. ఇక్కడ సహజసిద్ధంగా ఏర్పడిన లోయలో పెన్నానది వంపు తిరుగుతుంది.

హిమాచల్‌ ప్రదేశ్‌- స్విట్జర్లాండ్‌ 
మంచుతో కప్పేసిన కొండలు.. ఎటు చూసినా పచ్చిక. ఇలాంటి అనుభూతి కోసం.. చాలామంది స్విట్జర్లాండ్‌కు వెళ్తుంటారు. అక్కడివరకు వెళ్లకుండా హిమాచల్‌ ప్రదేశ్‌కు వెళ్లండి చాలు. అలాంటి ఫీలింగే మీకూ కలుగుతుంది. ఖర్చుతో పాటు సమయం కూడా కలిసొస్తుంది.

ఉత్తరాఖండ్‌ - యాంటెలోప్‌ లోయ 
ఉత్తరాఖండ్‌లో అందమైన పూల లోయలని చూస్తే.. యునైటెడ్‌ స్టేట్స్‌లోని యాంటెలోప్‌ లోయని చూసిన అనుభూతి పొందుతారు. ఉత్తరాఖండ్‌లోని పూల లోయలని చిత్రాల్లో బంధిస్తే యాంటెలోప్‌ లోయకు ఏ మాత్రం తీసిపోదు. దేవకన్యలు ఇక్కడికి వచ్చే వారని, ప్రకృతి ఈ పూల స్వర్గానికి తోటమాలని ప్రతీతి. 

మున్నార్‌- కామెరాన్‌ 
కేరళలోని పశ్చిమ కనుమల్లో ఉన్న మున్నార్‌లోని తేయాకు తోటల అందాలు మీ హృదయాన్ని తాకుతాయి. మరోవైపు మలేసియాలోని కామెరాన్‌లో ఉన్న పొలాలను చూస్తే రెండూ ఒకటేనా అని ఆశ్చర్యపోతారు. మున్నార్‌లో ఫొటో పాయింట్‌, ఎకో పాయింట్‌, ఏనుగుల ప్రదేశం, ఎరావికులం నేషనల్‌ పార్కు ప్రసిద్ధి. దీనిని ‘క్వీన్‌ ఆఫ్‌ గాడ్స్‌ ఓన్‌ ల్యాండ్‌’గా పిలుస్తారు. 

పుదుచ్చేరి- వియత్నాం 
పుదుచ్చేరి వెళ్లి సూర్యాస్తయం చూస్తూ ఫొటోలు తీసుకోండి. తిరిగి ఇంటికి వచ్చాక మీ మిత్రులతో వియత్నాంలోని ఫ్రెంచ్‌ కాలనీ దగ్గరి ఫొటోలు అంటే వాళ్లు నమ్మేస్తారు.ఎందుకంటే ఆ రెండూ ఒకేలా ఉంటాయి కాబట్టి. పుదుచ్చేరి వెళ్తే ఫ్రెంచ్‌ కాలనీలో ఉన్న అనుభూతినే పొందుతారు. ఫ్రెంచ్‌ సౌందర్యం కలిగి ఉన్న మ్యూజియం, బొటానికల్‌ గార్డెన్స్‌, చున్నంబార్‌ బోట్‌ హౌస్‌ పుదుచ్చేరిలో ప్రసిద్ధి.

అతిరాపల్లి - నయాగరా 
కేరళలోని అతిరాపల్లి జలపాతాన్ని భారత నయగారా జలపాతంగా పిలుస్తారు. అమెరికాలో ఉన్న నయగారా జలపాతం అందాలకు తగ్గకుండా అతిరాపల్లి జలపాతం ఉంటుంది. భారత చలనచిత్ర చరిత్రలో ప్రసిద్ధిగాంచిన బాహుబలి సినిమాలో జలపాత సన్నివేశాన్ని అతిరాపల్లి, వాజాచల్‌ జలపాతల వద్దే తీశారు.

థార్‌ - సహారా 
ఆఫ్రికాలోని సహారా ఎడారికి వెళ్లాలనుకునే ప్రకృతి ప్రేమికులు, రాజస్థాన్‌లోని థార్‌ ఎడారిలో కాలు మోపండి చాలు. అక్కడి ఇసుక తిన్నెల అందాలు మిమ్మల్ని మంత్రముగ్ధల్ని చేస్తాయి. గ్రేట్‌ ఇండియన్‌ డిజర్ట్‌గా పిలుచుకునే థార్‌ ఎడారిలో పర్యాటక అందాలకు కొదువలేదు. పగలు, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య అసలు పోలికే ఉండకపోవడం ఈ ఎడారికి ఉన్న మరో ప్రత్యేకత.

నైనిటాల్‌ - లేక్‌ డిస్ట్రిక్‌ 
ఇంగ్లండ్‌లోని లేక్‌ డిస్ట్రిక్‌ హాలీవుడ్‌ సినిమాల్లో కనిపిస్తుంటుంది. దాని రీతిలోనే నైనిటాల్‌ అందాలు దాగి ఉన్నాయి. నైనిటాల్‌ కొండలు, లోయల సోయగాలని చూడాలంటే ఉత్తరాఖండ్‌ వెళ్లాల్సిందే. భారతదేశపు సరస్సుల జిల్లాగా పిలవబడే నైనిటాల్‌ గురించి స్కందపురాణంలో కూడా పేర్కొన్నారు. దీంతో పాటు దేశంలోని 51 శక్తి పీఠాల్లోని ఒకటైన ‘నైనా దేవి’ ఇక్కడే కొలువుతీరింది.

అండమాన్‌ నికోబార్‌ దీవులు - మాల్దీవులు, మడగాస్కర్‌
తీవ్రమైన ఒత్తిడి నుంచి విరామం కోసం సముద్ర తీరాలకి ఎక్కువగా వెళ్తుంటారు. సెలవుల్లో ఉత్తమ బీచ్‌ కోసం వెతికితే మాల్దీవులు, మడగాస్కర్‌ అని చూపిస్తుంటాయి. అలాంటివే భారత్‌లో ఉంటే అక్కడి వరకు ఎందుకు వెళ్లడం? అవును నిజమే! మాల్దీవులు, మడగాస్కర్‌ మించిన అందాలు అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో దాగున్నాయి. 
ప్రపంచంలోని అందాలని చుట్టేయాలనుకునే యాత్రికులు వీటిని ట్రై చేస్తే సరి. దేశంలో ఉన్న అందాలని చూడకుండా విదేశాలకు పరిగెత్తితే సమయం, ఖర్చు వృథానే... కదా! 
(నోట్‌: పైన ఫొటోల్లో ఎడమవైపు ఉన్నది మన దేశంలో విహార స్థలం...కుడివైపున ఉన్నది విదేశీ విహార స్థలం)

Comments

Popular posts from this blog

How are Cloud Storage, Cloud Backup, and Cloud Sync Different

Debian vs. Ubuntu: The Similarities, Differences and Which One You Should Use

5 of the Best Free Online Translators to Translate Foreign Language